Tuesday, October 27, 2015

Telangana samsruthi

మనుగడ... సంస్కృతి

దాదాపు అన్ని పోటీపరీక్షల్లో జనరల్‌స్టడీస్‌ తప్పనిసరి. దీనిలో ముఖ్యాంశమైన సంస్కృతి గురించి అభ్యర్థులు అధ్యయనం చేయాలి. వివిధ వ్యక్తులు విభిన్న కోణాల్లో దీన్ని ఎలా నిర్వచించారో చదివి, అవగాహన పెంచుకోవాలి!

'ఒక జాతి అభివృద్ధి మార్గంలో నడచిన రీతిని సంస్కృతి అంటారు. వ్యక్తి చేసే అభివృద్ధి యత్నాన్ని సంస్కారం అనవచ్చు. సంస్కృతి, సంస్కరణం, సంస్కృతం, సంసారం మొదలైన పదాలన్నీ ఒకే కుదుట పుట్టాయి. వీటన్నింటికీ ఒకే అర్థం- హీనదశ/ ప్రాథమిక దశ నుంచి ఉత్తమ దశను చేరటానికి చేసే ప్రయత్నం. జాతులు కానీ, సంఘాలు కానీ భౌతికంగా, మానసికంగా ఉచ్ఛదశ పొందటానికి చేసే 'నిరంతర' యత్నమే వారి సంస్కృతి అని చెప్పవచ్చు'.ఆచార్య ఖండవల్లి లక్ష్మీ రంజనం, ఖండవల్లి బాలేందు శేఖరం కలిసి రాసిన 'ఆంధ్రుల చరిత్ర- సంస్కృతి'లోని నిర్వచనాన్ని వాడుకభాషలో ఇలా చెప్పొచ్చు. 1951లో ప్రచురితమైన ఈ గ్రంథాన్ని మాడపాటి హనుమంతరావు ప్రశంసించారు. ప్రసిద్ధ చరిత్రకారులు మారే మండ రామారావు దీన్ని ప్రామాణిక రచనగా పేర్కొన్నారు.సురవరం ప్రతాపరెడ్డి, నేలటూరి వేంకట రమణయ్య, చిలుకూరి వీదభద్రరావు, మాడపాటి హనుమంతరావు, పి.శ్రీనివాసాచారి, ఆదిరాజు వీరభద్రరావు, కొమఱ్ఱాజు లక్ష్మణరావు పంతులు మొదలైనవారు తెలుగు వారి సంస్కృతి గురించి గ్రంథాలు, వ్యాసాలు రచించి ఎన్నో అంశాలు వెల్లడించారు.సంస్కృతి చరిత్రలో అంతర్భాగం. సంస్కృతి లేని చరిత్ర ఉండదు. జీవనవిధానమే సంస్కృతి. కొందరు సంస్కృతి అనగానే ఆధ్యాత్మికపరమైనదిగా భావించడం సరికాదు. సమాజాన్ని సక్రమ మార్గంలో పయనింపజేసేది సంస్కృతి.భిన్న మానవ జాతుల్ని ఒకే తాటిపై కలిపేది సంస్కృతి. అంటే రకరకాల పూలను కలిపే అంతస్సూత్రం వంటిది. సమాజం ఒక సభ్యతగా క్రమపద్ధతిలో నడవడానికి కారణమిది. దీని నుంచి అలవడేది సంస్కారం. ప్రాచ్య, పాశ్చాత్య విద్వాంసులు, తత్త్వవేత్తలు 'సంస్కృతి'ని పలువిధాలుగా నిర్వచించారు. సంస్కృతి అనేది ఘనరూపం కాదు- ద్రవ రూపం వంటిది. అనేక భావజాలాల, మతాల, ఆశయాల, ఆచరణల.. సమాహారం. అందుకే విభిన్న నిర్వచనాలు వెలువడ్డాయి. వాటిలో ముఖ్యమైనవి కొన్ని-
* 'సహనమే సంస్కృతి' - డా. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ 
సమాజంలో, జీవితంలో సహనం అన్ని సమస్యలనూ పరిష్కరిస్తుంది. మానసిక ప్రశాంతత కలిగిస్తుంది. ఆవేశాన్ని చల్లార్చి సన్మార్గంవైపు ఆలోచింపజేస్తుంది.
* 'ఒక జాతి ప్రజల మౌలిక జీవనవిధానమే సంస్కృతి' - డి.డి.కోశాంబి
ఇందులో 'మౌలిక' అనేది గమనార్హం. 'ఒరిజినల్‌' అని అర్థం. తెచ్చిపెట్టుకున్నదీ, అనుకరణతో కూడుకున్నదీ కాదు.
* 'ఆచార సంప్రదాయాల ద్వారా భావితరాలకు అందింపగల మానవ భౌతిక, మానసిక సాధనాల సమాహారమే సంస్కృతి' - మజుందార్‌
ఇందులో సంస్కృతి వారసత్వమన్న అంశం ఇమిడివుంది. ఆధ్యాత్మికమైనవే కాకుండా, భౌతికపరమైన అంశాలను కూడా చేర్చడం ప్రత్యేకత. ఆచారాలు సంప్రదాయ పుత్రికలే. ఈ ఆచారాల్లో కూడా కులాలవారీగా, ప్రాంతాలవారీగా, జాతులవారీగా భిన్నంగా ఉంటాయి.
* 'ఒక జాతి లేదా సంఘం భౌతికంగా, మానసికంగా హీనదశ నుంచి ఉత్తమదశకు చేరుకోవడానికి చేసే నిరంతర ప్రయత్నం' - ఖండవల్లి లక్ష్మీరంజనం
మానవుడి ఉదాత్తవ్యక్తిత్వం ఇందులో గురించి ఇందులో చెప్పారు.
* 'ఒక తరం నుంచి మరో తరానికి సాంఘిక వారసత్వంగా విద్య, ఆచారాల వల్ల సంక్రమించే ఆశలు, ఆశయాలు, విలువల సమాహారం సంస్కృతి' - గ్రాహమ్‌ వల్లాస్‌
మొదటగా విలువలు సంస్కృతిలో భాగమని చెప్పడం విశేషం.
ఈ విధంగా ఎందరో ఎన్ని విధాలుగా నిర్వచించినా మానవ మనుగడకూ, నాగరికతకూ తోడ్పడేది సంస్కృతి అన్నదే సారాంశం. ఇది పరోపకార పరాయణత, సచ్ఛీలం, మానవీయ విలువల సంగమం. సంస్కృతి లేని సమాజాన్ని వూహించలేం. భారతీయ సంస్కృతి విశిష్టత ఏమిటంటే 'భిన్నత్వంలో ఏకత్వం' అనే లక్షణం.నాగరికత వేరుచరిత్ర శరీరమైతే- సంస్కృతి ప్రాణం. కొందరు సంస్కృతి, నాగరికత ఒకటిగా భావిస్తారు కానీ అది సమంజసం కాదు. సంస్కృతి ఉదాత్తమైనది, జాతి ఔన్నత్యాన్ని, వైశిష్ట్యాన్ని వెల్లడించేది. నాగరికత అంటే నగర జీవనవిధానం అని అసలైన అర్థం. నగరంలో నివసించేవారు ఉన్నతంగా, ఉదాత్తంగా ఉంటారని అలా అన్నారు కానీ- ఇవాళ పల్లెల్లో ఉన్నవారూ 'నాగరికులు'గా అనిపిస్తారు. అయితే నాగరికత అనేది సంస్కృతిలో ఒక భాగమే. 'సింధునాగరికత'ను మనం మరచిపోగలమా? ఇది అతి ప్రాచీనమైన సంస్కృతికి నిదర్శనం కదా! సంస్కృతి లేదా నాగరికత అనేది భౌగోళిక పరిస్థితులను బట్టి కూడా ఉంటుంది. కొండ ప్రాంతాల్లో నివసించే వారి సంస్కృతి వేరు. సముద్ర, నదీ ప్రాంతాలవారి సంస్కృతి వేరు. భారతదేశ సంస్కృతి అనేక దేశాల సంస్కృతి కంటే చాలా భిన్నమైనది, ప్రాచీనమైనది. భిన్న జాతులు, భాషలు, మతాలు ఉండడమే దీనికి కారణం.సంస్కృతి అనేది సామూహిక జనసృష్టి. మన సంస్కృతి సంకీర్ణం కూడా. ఇతర దేశాల, మతాల సంస్కృతిని ఆహ్వానించడం, ఆదరించడం భారతదేశపు ప్రత్యేకత. క్రీ.పూ. నాలుగువేల సంవత్సరాలకు పూర్వమే భారతీయ సంస్కృతి ఉందని కొందరి సిద్ధాంతం. ఆర్య సంస్కృతి తరువాత ద్రావిడ సంస్కృతి వచ్చిందన్న అభిప్రాయం ఉంది. మొహంజొదారో, హరప్పా నాగరికతలను ద్రావిడ నాగరికతలు అంటారు. ఆర్యులు ద్రావిడుల ప్రభావం వల్లనే భాషా సంస్కృతులకు వ్యాప్తి తీసుకొచ్చారు. ఇచ్చి పుచ్చుకునే సుగుణం వల్ల భారతీయ సంస్కృతి పేరొందింది.వేద పూర్వ సంస్కృతి, ఆర్య సంస్కృతి, ద్రావిడ సంస్కృతి, మతోద్యమ సంస్కృతి, యూరోపియన్‌ సంస్కృతి (పాశ్చాత్య సంస్కృతి) మొదలైనవి భారతీయ సంస్కృతికి వన్నెచిన్నెలు తెచ్చినవే.అధ్యయనానికి ఆధారాలుమన సంస్కృతి అధ్యయనానికీ, పరిశోధనలకూ చాలా ఆధారాలున్నాయి- 
* పురాతత్వశాస్త్రం: మతాల చరిత్ర, ఒకనాటి జనుల జీవనవిధానాలు తెలుపుతుంది. పురాతన స్థల ఖనన పరిశోధనలు అవసరం. 
* శాసనాలు: శాసనాల్లో పరిపాలన పద్ధతులు, దానధర్మాలు, తూకాలు, ఆచారాలు తెలుపుతాయి. 
* కళలు: శిల్పం, చిత్రలేఖనం, నాట్యం, దేవాలయాలు, ధర్మకార్యాలు, విలాసాలు అవగతమవుతాయి. 
* సాహిత్యం: సంస్కృతీ విశేషాలను తెలిపే ఇతిహాసాలు, పురాణాలు, కావ్యాలు చాలా ఉన్నాయి. సురవరం ప్రతాపరెడ్డి 'ఆంధ్రుల సాంఘిక చరిత్ర' రచనకు చాలావరకు సాహిత్యమే తోడ్పడింది. సింహాసన ద్వాత్రింశిక, క్రీడాభిరామం, శుకసప్తతి వంటి రచనల్లో తెలుగువారి సంస్కృతీ విశేషాలు చాలా కనబడతాయి. 
* జానపద వాంగ్మయం: వస్తు సంస్కృతి, భాషా సంస్కృతి, పండుగలు, నమ్మకాలు, భోజన సంస్కృతి మొదలైన వాటికి ఆధారం. సామెతలు, జాతీయాలు, పొడుపు కథల్లో కూడా సాంస్కృతిక అంశాలుంటాయి.అంతర్భాగం భాషసంస్కృతిలో భాష కూడా అంతర్భాగమే. సంస్కృతి అభివృద్ధికి భాష ఒక సాధనం. భాష పరిశీలనవల్ల కొన్ని విశేషాలు తెలుస్తాయి. భాషా నైపుణ్యంతోపాటు సంస్కృతి అభివృద్ధి చెందింది. సాంస్కృతిక భావనలను వెల్లడించడంలో భాష ప్రధానపాత్ర వహించింది. భాష చరిత్రనూ, సంస్కృతినీ బలోపేతం చేసింది, చేస్తోంది. భాషా సాహిత్యాలు సంస్కృతీ వైభవానికి రెండు రథ చక్రాలవంటివి.చరిత్ర శరీరమైతే సంస్కృతి ప్రాణం. నాగరికత సంస్కృతి ఒకటి కాదు. నాగరికత దేహధర్మం. అంటే బాహ్యానికి సంబంధించినది. సంస్కృతి ఆత్మధర్మం. అంటే అంతరంగానికి సంబంధించినది. సంస్కృతీ విశేషాలు చాలా ఉన్నాయి-గృహం- కుటుంబం- వివాహం- వేషభాషలు- కట్టూబొట్టూ- ఆభరణాలు- ఆటలూ- పాటలూ- ధార్మిక కార్యక్రమాలు- పండుగలూ- గృహపరిశ్రమలూ- వ్యవసాయం- కళలు- శాస్త్రాలు- ఆహారాదులు- సంభాషణలూ- వాస్తుజ్యోతిషాది నమ్మకాలూ.... ఇలా ఎన్నిటినో సంస్కృతిలో భాగాలుగా చెప్పవలసి ఉంటుంది.చార్వాక, నాస్తిక, హేతువాద భావజాలాల ఆధారంగా సంస్కృతిలో మార్పు వచ్చింది. ఏమైనా సంస్కృతి లేని సమాజం చెరకు పిప్పిలాంటిది అనడం సమంజసమే

No comments:

Post a Comment