విష్ణుకుండినులు
విష్ణుకుండినులు క్రీ.శ. 5, 6 శతాబ్దాల్లో తెలంగాణను పాలించారు. వీరి వంశ స్థాపకుడు ఎవరనే విషయంలో చరిత్రకారుల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. వీరి కులదైవం శ్రీపర్వతస్వామి, మల్లికార్జునుడు అని చెబుతుండగా.. ఇద్దరూ ఒకటేనని కీల్ హారన్ అనే పండితుడు పేర్కొన్నాడు. శ్రీపర్వతస్వామి అంటే బుద్ధదేవుడు అని నేలటూరు వేంకటరమణయ్య అభిప్రాయపడ్డారు.
మహా రాజేంద్రవర్మ
చరిత్రకారుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఎక్కువగా లభించే సమాచారం ప్రకారం మహా రాజేంద్రవర్మ విష్ణుకుండిన వంశ స్థాపకుడు. గోవిందవర్మ వేయించిన ఇంద్రపాల నగర తామ్ర శాసనంలో ఈ విషయాన్ని పేర్కొన్నారు. మహా రాజేంద్రవర్మ క్రీ.శ. 358లో విష్ణుకుండిన రాజ్యాన్ని స్థాపించాడు. ఇంద్రపాల నగరాన్ని (తుమ్మల గూడెం, నల్గొండ జిల్లా) నిర్మించి రాజధానిగా చేసుకున్నాడు. రామతీర్థ శాసనం వేయించాడు.
మొదటి మాధవవర్మ
మహా రాజేంద్రవర్మ కుమారుడు మొదటి మాధవవర్మ. అమరాబాద్, కీసర, భువనగిరి ప్రాంతాల వరకు రాజ్యాన్ని విస్తరింపజేశాడు. ఇంద్రపాల నగర తామ్రశాసనంలో ఇతడి గురించి ప్రశంస ఉంది. పాలమూరు శాసనం ప్రకారం ఇతడికి విక్రమ మహేంద్ర అనే బిరుదు ఉండేది.
గోవిందవర్మ
మొదటి మాధవవర్మ కుమారుడు గోవిందవర్మ. విష్ణుకుండిన వంశ తొలిరాజుల్లో అగ్రగణ్యుడు. ఇంద్రపాల నగర తామ్ర శాసనాన్ని వేయించాడు. పణిగిరి లాంటి ప్రాంతాల్లో బౌద్ధారామాలను నిర్మించాడు. హైదరాబాద్ నగర సమీపాన చైతన్యపురిలోని మూసీనది తీరంలో లభించిన ప్రాకృత శాసనం ఈ రాజు పేరున వెలసిన గోవింద రాజవిహారం, చైత్యాలయాల గురించి తెలుపుతుంది. అనంతర కాలంలో ఈ నిర్మాణాలు శిథిలం కాగా, శాసనం మాత్రమే మిగిలింది. గోవిందవర్మ పట్టపురాణి పరమ మహాదేవి పేరున ఇంద్రపురిలో చాతుర్ధశౌర్య సంఘ బౌద్ధ భిక్షువులకు మహావిహారాన్ని నిర్మించారు. ఈ విహార పోషణకు గోవిందవర్మ పెణ్కపర గ్రామాన్ని దానంగా ఇచ్చాడు.
రెండో మాధవవర్మ
విష్ణుకుండినుల్లో గొప్పవాడు రెండో మాధవవర్మ. వైదిక మతాభిమాని. అశ్వమేధ, రాజసూయ, వాజపేయ అగ్నిష్టోమ, నరమేధ లాంటి క్రతువులు నిర్వహించాడు. ఇతడు పురుషమేధం అనే యజ్ఞాన్ని హైదరాబాద్ సమీపంలోని కీసరలో నిర్వహించినట్లు పురావస్తు శాఖ తవ్వకాల్లో బయల్పడింది. రెండో మాధవవర్మ కాలంలో తెలంగాణలో అనేక దేవాలయాలను నిర్మించారు. ఇంద్రపాల నగరంలో అమరేశ్వరాలయం, రామేశ్వరాలయం, మల్లికార్జునాలయం; చెరువుగట్టులో జడల రామలింగేశ్వరాలయం, షాద్‌నగర్ సమీపంలో ఉత్తర రాజలింగేశ్వరాలయం, పులిగిళ్లలో రామలింగేశ్వరా లయాలు ముఖ్యమైనవి. ఈయన కాలంలోనే విష్ణుకుండినుల రాజచిహ్నం పేరున కేసరి రామలింగేశ్వరాలయాన్ని కీసరలో నిర్మించారు.
మూడో మాధవవర్మ
మూడో మాధవవర్మ ఈవూరు తామ్రశాసనం వేయించాడు. త్రికూట 'మలయాధిపతి అనే బిరుదు ఉండేది. ఇంద్రవర్మ, అగ్నివర్మ అనే బ్రాహ్మణులకు మ్రుతుకలి గ్రామాన్ని అగ్రహారంగా ఇచ్చినట్లు శాసనం ఉంది.
ఇంద్ర భట్టారకవర్మ
ఇంద్ర భట్టారకవర్మ అనేక ఘటికాస్థానాలను (హిందూ విద్యాకేంద్రాలు) స్థాపించాడు. కీసర సమీపంలో ఉన్న ఘటకేశ్వరం (ఘట్‌కేసర్, రంగారెడ్డి జిల్లా) ఇంద్ర భట్టారకవర్మ నెలకొల్పిన ఘటికాస్థానమే. ఇతడు అనేక ఘటికలు స్థాపించినట్లు ఉద్దంకుడు 'సోమవేదం అనే గ్రంథంలో తెలిపాడు. ఇంద్ర భట్టారక వర్మకి 'సత్యాశ్రయుడు అనే బిరుదు ఉండేది. విష్ణుకుండినుల్లో చివరి పాలకుడు మంచన భట్టారకుడు. ఇతడిని తరిమివేసి చాళుక్యులు రాజ్యాన్ని ఆక్రమించారు.
ఆర్థిక పరిస్థితులు
విష్ణుకుండినులు ముద్రించిన నాణేల్లో నాణ్యత లోపించింది. వీటి తయారీకి ఉపయోగించిన లోహం రాగి మలామాతో చేసిన ఇనుము. పరిశ్రమలు, వాణిజ్యం క్షీణించడంతో ప్రాచీన నగరాలు వాటిని అనుసంధానం చేసే రహదారులు నష్టపోయాయి. వీరు లంఘించు సింహపు గుర్తులున్న నాణేలు వేశారు. ఏలేశ్వరంలో విక్రమేంద్ర వర్మ వేయించిన నాణేలు దొరికాయి. ఇందులోని నాణేలు రాగి, సత్తుల మిశ్రమం. కుంభం, సింహం అనే అక్షరాలు కనిపిస్తాయి. భువనగిరి, సుల్తానాబాద్ తాలూకాల్లో రాగి నాణేలు దొరికాయి.
వాణిజ్యం
బర్మా, సయాం, కంబోడియా, చైనా, జపాన్, సిలోన్ దేశాలతో విదేశీవ్యాపారం చేసేవారు. రెండో మాధవవర్మ త్రిసముద్రాధిపతి. ఇతడి రాజ్యానికి ఉత్తరాన రేవా నది ఉండేది. నగదుతో స్వదేశీ వ్యాపారం జరిగేది. మొదటిసారిగా సామంత రాజులను పన్ను వసూలు యంత్రాంగంలో భాగంగా చూడటం వీరి కాలంలోనే ప్రారంభమైంది.
సాంఘిక పరిస్థితులు
విష్ణుకుండినులు బ్రాహ్మణులు. వైదిక మతాన్ని అనుసరించారు. వీరి కాలంలో కుల వ్యవస్థ బాగా బలపడింది. రెండో మాధవవర్మ అశ్వమేధ యాగాలు చేశాడు. కొంత మంది ప్రభువులు తమను తాము పరమ మహేశ్వరులుగా చెప్పుకున్నారు. 18 మత శాఖల సిద్ధాంతాలు పూర్తిగా తెలిసి మానవ జాతిని జీవన, మరణ, దుఃఖాల నుంచి కాపాడేందుకు యజ్ఞాలు, కర్మలు చేసే దశ బలబలి అనే పండితుడు గోవిందవర్మ ఆస్థానంలో ఉండేవాడు. ఆ పండితుడికి గోవిందవర్మ వెంకపర గ్రామాన్ని దానంగా ఇచ్చాడు. విష్ణుకుండినుల కులదైవం శ్రీపర్వతస్వామి కొండమోటు నరసింహ శిల్పం జనాదరణ పొందింది.
బౌద్ధమతం
విష్ణుకుండినుల కాలంలో బౌద్ధమతం రాజాదరణ, ప్రజాదరణ పొందింది. గోవిందవర్మ బౌద్ధమతాన్ని ఆదరించి అనేక నిర్మాణాలు చేశాడు. వీరి కాలంలో పణిగిరి, గాజులబండ, ఏలేశ్వరం, తుమ్మలగూడెం, నాగారం, వర్థమాన కోట, నేలకొండపల్లి, ముదిగొండ, హైదరాబాద్ సమీపంలో చైతన్యపురిలోని మూసీ తీరంలో బౌద్ధ నిర్మాణాలు జరిగాయి. క్రమంగా బౌద్ధంలో వజ్రాయాన శాఖ వ్యాపించింది. ఈ శాఖ నుంచి తాంత్రికాచారాలు, శక్తి పూజలు వచ్చాయి. వజ్రాయాన శాఖ వారి దుర్నీతి, నీతి బాహ్యచర్యల వల్ల బౌద్ధమతం ప్రజాదరణను కోల్పోయింది.
విద్య.. సాహిత్యం
విష్ణుకుండినుల రాజభాష సంస్కృతం. వీరు ఘటికలను (హిందూ విద్యాకేంద్రాలు) స్థాపించి వేద విద్యలను ప్రోత్సహించారు. తెలంగాణలో వీరు మొదటిసారిగా ఘటికలను స్థాపించారు. ఘటిక ఎలా స్థాపించాలో ఉదంకుడు సామవేదంలో పేర్కొన్నట్లు ఒక శాసనం ద్వారా తెలుస్తోంది. రెండో విక్రమేంద్రవర్మ భగవంతుడు, త్రయంబకుడు అయిన సోమగిరీశ్వరనాథుడికి నతవాడి (పాలన) విషయంలో రెగొన్ర అనే గ్రామాన్ని దానం చేశాడు. ఘటికల్లో చతుర్దశ విద్యలను బోధించేవారు. శాసనాల్లో విష్ణుకుండినులు దక్షిణాపథపతి, త్రికూట మలయాధిప, శ్రీపర్వతస్వామి పాదానుద్యాతలుగా పేర్కొన్నారు.
విష్ణుకుండినుల శాసనాల్లో తెలుగు పదాలు కనిపిస్తాయి. చిక్కుళ్ల తామ్ర శాసనంలో 'విజయరాజ్య సంవత్సరంబుల్ అనే తెలుగు పదం కనిపిస్తుంది. భవశర్మ అనే కవి వేదాంగాలు, ఉపనిషత్తులు అధ్యయనం చేశాడని తాండవ శాసనంలో వర్ణించారు. దగ్గుపల్లి దుగ్గన 'నచికేతోపాఖ్యానం రచించాడు. 'జనాశ్రయచ్ఛందోవిచ్ఛిత్తి అనే పురాతన సంస్కృత ఛందోగ్రంథం మాధవవర్మ కాలంలో రచించారని ప్రతీతి. ఈ గ్రంథ రచయిత గుణస్వామి. ఈ గ్రంథంలో కాళిదాసు వరరుచి, సుందరపాండ్య, శూద్రకుల పద్యాలు ఉదాహరణగా పేర్కొన్నారు.
వాస్తు శిల్పాలు
విష్ణుకుండినులు తెలంగాణ ప్రాంతంలో రామలింగేశ్వర దేవాలయాల పేరిట శివాలయాలు నిర్మించారు. వీరి శిల్పాల్లో నాగార్జునకొండ రీతి కనిపిస్తుంది. వారి కాలంలో వివిధ దేశాలకు తమ సంస్కృతిని వ్యాపింపజేశారు. బర్మా దేశంలోని తైలాంగ్‌లు తెలంగాణ వారేనని 'ఫెరే బ్రహ్మచరిత్ర తెలుపుతుంది. విష్ణుకుండినులు ఆంధ్రప్రాంతంలో అనేక దేవాలయాలు నిర్మించారు. బుజ్జన్నకొండ, మొగల్‌రాజపురం, విజయవాడ, ఉండవల్లి భైరవ కొండ గుహాలయాలు, శివాలయాలను వీరు నిర్మించారు.
పాలనా స్వరూపం
విష్ణుకుండినులు పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని రాష్ట్రాలు, విషయాలుగా విభజించారు. రాష్ట్రాలకు రాష్ట్రీకులు, విషయాలకు విషయాధిపతులు అనే అధికారులుండేవారు. హస్తికోశుడు గజబలాలపై, వీరకోశుడు పదాతిదళాలపై సైనికాధికారులుగా ఉండేవారు. వీరిద్దరూ తమ ప్రభువుల తరపున దానాలు చేసేవారు. రజ్జుక అనే అధికారి భూములను కొలిచేవాడు. ఫలదారు భూమిశిస్తును నిర్ణయించేవాడు. గుల్మికుడు సరిహద్దు రాష్ట్రాలపై నియమించిన సైనిక ప్రతినిధి. సెట్టి ప్రభుత్వ ఆదాయాన్ని కొలిచేవాడు. అక్షపటలాధికృతుడు లేదా అక్షపటలాధికారి అనేవాడు రాజాజ్ఞలను రాయించేవాడు.
No comments:
Post a Comment