Tuesday, October 27, 2015

IBPS RRB RECRUITMENT

BPS - Regional Rural Banks Special

గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగాలు

బ్యాంకు నియామకాల జోరు పెరుగుతోంది. ఉద్యోగార్థులకు సంతోషం కలిగిస్తూ వరసగా ప్రకటనలు జారీ అవుతున్నాయి. గ్రామీణ బ్యాంకుల ప్రకటన ఈ వరసలోనిదే! ఈ పోస్టులపై ఆసక్తి ఉన్నవారు గమనించాల్సిన అంశాలేమిటి? సన్నద్ధత వ్యూహం ఎలా రూపొందించుకోవాలి?

దేశవ్యాప్తంగా 54 గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీసర్‌ (స్కేల్‌ 1, 2, 3), క్లర్కు (ఆఫీసు అసిస్టెంట్‌) ఉద్యోగాల నియామకాలకు ఐబీపీఎస్‌ ప్రకటన జారీ చేసింది. అందులో మన రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన బ్యాంకులు 5 ఉన్నాయి. దరఖాస్తు చేసుకోవాలంటే తప్పనిసరిగా తెలుగు భాషలో ప్రావీణ్యం (చదవడం, రాయడం, మాట్లాడడం) కలిగి ఉండాలి.
ఒకే అభ్యర్థి ఆఫీసర్‌, క్లర్కు ఉద్యోగాలు రెండింటికీ దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులు విడివిడిగా చేసుకోవాల్సి ఉంటుంది.

వయః పరిమితి 
* క్లర్కు (ఆఫీస్‌ అసిస్టెంట్‌) 18 నుంచి 28 సంవత్సరాల మధ్య 
* ఆఫీసర్‌ (స్కేల్‌- 1) 18 నుంచి 30 సంవత్సరాల మధ్య. ప్రభుత్వ నిబంధనల మేరకు వయఃపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

విద్యార్హతలు 
క్లర్కు (ఆఫీస్‌ అసిస్టెంట్‌) 
* గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 
* ప్రాంతీయ భాషలో ప్రావీణ్యం ఉండాలి. 
* కంప్యూటర్‌ నైపుణ్యం అవసరం.

ఆఫీసర్‌ (స్కేలు-1) 
* గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి (వ్యవసాయ సంబంధిత డిగ్రీ కలిగిన వారికి ప్రాధాన్యం). * ప్రాంతీయ భాషలో ప్రావీణ్యం ఉండాలి. కంప్యూటర్‌ పరిజ్ఞానం అదనపు అర్హత.

ఎంపిక రెండు దశల్లో ఉంటుంది. 1. ఆబ్జెక్టివ్‌ ఆన్‌లైన్‌ పరీక్ష 2. ఇంటర్వ్యూ

ఆన్‌లైన్‌ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు రాష్ట్రాలవారీగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ప్రతి రాష్ట్రంలో ఒక నోడల్‌ గ్రామీణ బ్యాంకు ఇంటర్వ్యూ ప్రక్రియను ఐబీపీఎస్‌ సహకారంతో నిర్వహిస్తుంది.

ఇంటర్వ్యూలో ఎంపికైన అభ్యర్థులను ఆ రాష్ట్రంలో ఒక ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుకు కేటాయిస్తారు.

పరీక్ష కేంద్రాలు 
తెలంగాణ: హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, వరంగల్‌.

ఆంధ్రప్రదేశ్‌: అనంతపురం, చీరాల, చిత్తూరు, గుంటూరు, హైదరాబాద్‌, కాకినాడ, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, పుత్తూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభతేదీ: 8.7.2015. చివరి తేదీ: 28.7.2015. దరఖాస్తులు ఆన్‌లైన్‌లో మాత్రమే చేసుకోవాలి. ఆన్‌లైన్‌ పరీక్ష సెప్టెంబర్‌ 2015లో నిర్వహిస్తారు.

ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి క్లర్కు పరీక్షకు ఒకసారి కంటే ఎక్కువసార్లు, ఆఫీసర్‌ పరీక్షకు ఒకసారి కంటే ఎక్కువసార్లు హాజరుకాకూడదు. ఇంటర్వ్యూకు కూడా క్లర్కుకు ఒకసారి, ఆఫీసరుకు ఒకసారి మాత్రమే హాజరుకావాలి. అలాకాకుండా ఒకే ఉద్యోగానికి క్లర్కు/ ఆఫీసరు ఒకసారి కంటే ఎక్కువసార్లు హాజరయితే అభ్యర్థిత్వం రద్దు చేస్తారు.

సన్నద్ధత విధానం
సబ్జెక్టులపరంగా చూస్తే ఆఫీసర్‌ పరీక్ష, ఆఫీసు అసిస్టెంట్‌ (క్లర్కు) పరీక్ష ఒకేరకంగా ఉన్నాయి. ప్రశ్నలస్థాయిలో వ్యత్యాసం ఉంటుంది.
రీజనింగ్‌: ఈ సబ్జెక్టును రెండు స్థాయులుగా చూడవచ్చు. సాధారణంగా అమలులో ఉన్న పద్ధతులు, సంప్రదాయాలను అనుసరించి నిర్ణయించే విధానం ఒకటి. ఈ విధానం ఆఫీసు అసిస్టెంట్‌ (క్లర్కు) పరీక్షకు సరిపోతుంది.

తర్కజ్ఞానంతో సమస్యను విశ్లేషణాత్మకంగా పరిశీలించి నిర్ణయించే పద్ధతి రెండోది. ఇది ఆఫీసరు పరీక్షకు సంబంధించిన ప్రశ్నలకు అన్వయించవలసి ఉంటుంది. అంటే తర్కజ్ఞానం (లాజికల్‌ ఎబిలిటీ)పై ఆధారపడి అభ్యర్థి మానసిక సామర్థ్యం, ఉన్నతస్థాయి ఆలోచనాసరళిలను పరిశీలించడానికీ, నిర్ణయాలు తీసుకునే శక్తిని (డెసిషన్‌ మేకింగ్‌ ఎబిలిటీ) పరీక్షించడానికీ ఉద్దేశించిన విభాగమిది. రీజనింగ్‌లో ఇచ్చిన సమాచారాన్ని నిశితంగా పరిశీలించడం అత్యంత ముఖ్యమైన విషయం.

న్యూమరికల్‌ ఎబిలిటీ/ క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌: ఈ విభాగాన్ని సమర్థంగా చేయడానికి తొలిమెట్టు పదోతరగతిలోపు ఉన్న గణిత సూత్రాలను క్షుణ్ణంగా నేర్చుకోవడమే. ప్రాథమిక సూత్రాలు (శాతాలు, సరాసరి, నిష్పత్తి విశ్లేషణ, లాభనష్టాలు, వడ్డీ సూత్రాలు) ఉపయోగించి చేయవలసిన ప్రశ్నలు ఆఫీసు అసిస్టెంట్‌ (క్లర్కు) పరీక్షకు ఎక్కువగా వస్తాయి.
ఎక్కువ దత్తాంశం (డేటా)తో కూడిన క్లిష్టమైన ప్రశ్నలు ఆఫీసర్‌ స్కేలు-1 పరీక్షకు వస్తాయి. అయితే ఈ ప్రశ్నలు కూడా సమర్థంగా పరిష్కరించడానికి ప్రాథమిక సూత్రాలపై పూర్తి అవగాహన అవసరం.

జనరల్‌ అవేర్‌నెస్‌: ఆఫీసు అసిస్టెంటు (క్లర్కు), ఆఫీసరు పరీక్షలు రెండింటికీ జనరల్‌ అవేర్‌నెస్‌ ఒకే స్థాయిలో ఉంటుంది. బ్యాంకింగ్‌, ఆర్థిక రంగాల సమకాలీన అభివృద్ధి, మార్పులపై నిశిత పరిశీలన ఈ విభాగాన్ని సమర్థంగా చేయడానికి ఉపయోగపడుతుంది. బ్యాంకు కొత్తగా ప్రభుత్వం ప్రవేశపెట్టే ఆర్థిక పథకాలు, బ్యాంకులు ద్వారా ఖాతాదారులకు లభించే సదుపాయాలు, ఇన్సూరెన్స్‌ పథకాలు మొదలైన అంశాలకు ఈ పరీక్షలో ప్రాధాన్యం ఉంటుంది. యోజన, ఇతర ప్రభుత్వ పథకాల సమాచారం లభించే మ్యాగజీన్ల నుంచి విషయ సేకరణ చేసుకుని సన్నద్ధమయితే అభ్యర్థికి లాభిస్తుంది.

ఇంగ్లిష్‌: ఈ విభాగపు సన్నద్ధతలో అభ్యర్థి వ్యాకరణం, పదజాలం, కాంప్రహెన్షన్‌లపైన దృష్టిసారించాల్సి ఉంటుంది. ఇంగ్లిష్‌ భాషా పరిజ్ఞానానికి సంబంధించి పై మూడు అంశాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న అంశాలు.

కంప్యూటర్‌ నాలెడ్జ్‌: సాధారణంగా లభించే కంప్యూటర్‌ సంబంధిత పుస్తకాల సన్నద్ధత ఈ విభాగాన్ని సమర్థంగా చేయడానికి ఉపయోగపడుతుంది. ప్రాథమిక అంశాలు ఈ రంగాన వచ్చే సాంకేతిక మార్పులు, నవీకరణ అంశాలపై ప్రశ్నలుంటాయి. బ్యాంకింగ్‌ వ్యవస్థకు కంప్యూటర్‌ అనుసంధానంపై కూడా ప్రశ్నలుంటాయి.

200 మార్కులకు 2 గంటల కాలవ్యవధితో ఆన్‌లైన్‌లో ఆబ్జెక్టివ్‌ విధానంలో అటు ఆఫీసు అసిస్టెంట్‌, ఆఫీసర్‌ ఉద్యోగాలకు వేర్వేరుగా రాతపరీక్ష ఉంటుంది.
రీజనింగ్‌, న్యూమరికల్‌ ఎబిలిటీ/ క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ విభాగాలకు ఎక్కువ వెయిటేజీ, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ విభాగానికి తక్కువ వెయిటేజీ ఇచ్చారు. ప్రశ్నల సంఖ్య అన్ని విభాగాలకు సమానంగా (ఒక్కో విభాగానికి 40) ఉన్నప్పటికీ మార్కుల కేటాయింపు వెయిటేజీలో తేడా ఉంది. కాబట్టి ఇచ్చిన సమయంలో అభ్యర్థులు మార్కుల వెయిటేజీని బట్టి సమయ విభజన చేసుకోవాల్సి ఉంటుంది. రీజనింగ్‌, న్యూమరికల్‌ ఎబిలిటీ విభాగాలకు ఎక్కువ సమయం కేటాయించుకోవడం ద్వారా సమయ వృథాను అరికట్టవచ్చు.
ఇంటర్వ్యూలో అభ్యర్థులకు వ్యక్తిగత విలువలు, నిబద్ధత, ఆత్మవిశ్వాసం అవసరం. వీటితోపాటు స్థానిక అంశాలపై విస్తృత అవగాహన ముఖ్యం. స్థానిక స్థితిగతులు, భౌగోళిక ప్రాధాన్యాలు, స్థానిక సంప్రదాయాలపై ఎక్కువగా ప్రశ్నలు వేసే అవకాశముంది.

No comments:

Post a Comment