* కన్నడ భాషకు స్వర్ణయుగంవేములవాడను పేరులోనే ఇముడ్చుకున్న చాళుక్యులది తెలంగాణ చరిత్రలో ప్రత్యేక స్థానం. రాష్ట్ర కూటులకు సామంతులైన వీరి కాలంలో ఎందరో కవులు కీర్తిని పొందారు. కన్నడ రాజభాష మాత్రమే కాదు.. ఆ భాషకు స్వర్ణయుగం వీరి పాలనాకాలం. దేవాలయాల నిర్మాణంలో చాళుక్యుల కృషి చరిత్ర లిఖితం. సంస్కృతీ సంప్రదాయాలకు పెద్దపీట వేసిన వేములవాడ చాళుక్యుల కాలంలో పాలన, కీర్తి, సాహిత్యం తదితర అంశాలు ఆసక్తికరం..వేములవాడ చాళుక్యులు తెలంగాణ ఉత్తర ప్రాంత (నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలు) పరిధిలో.. క్రీ.శ. 7వ శతాబ్దపు ఉత్తరార్ధం నుంచి 11వ శతాబ్దపు పూర్వార్ధం వరకు పాలించారు. వీరు రాష్ట్ర కూటులకు సామంతులుగా పాలన సాగించారు. జైన, శైవ మతాలను ఆదరించి, పోషించి తెలంగాణ సంస్కృతికి ఎనలేని సేవ చేసిన చాళుక్యులు బోధన్, గంగాధర, వేములవాడ పట్టణాలను రాజధానులుగా చేసుకుని పారిపాలించారు. వీరు అనేక దేవాలయాలను నిర్మించడమే కాకుండా బహుభాషా కవులను పోషించారు. వీరి చరిత్రకు సంబంధించి వివిధ ఆధారాలున్నాయి.
చారిత్రక ఆధారాలు
శాసనాలు
1) కొల్లిపర తామ్ర శాసనం - మొదటి అరికేసరి
2) పర్భిణి తామ్ర శాసనం - మూడో అరికేసరి
3) కురిక్క్యాల శాసనం - జిన వల్లభుడు
7) కురవగట్టు శాసనం - బీర గృహుడు
గ్రంథాలు
పంపకవి రచించిన విక్రమార్జున విజయం, సోమదేవ సూరి రచించిన యశస్తిలక చంపూ కావ్యం.
రాజధాని పేరుతోనే..
వీరు వేములవాడను రాజధానిగా చేసుకుని పాలించారు. అందువల్లే వేములవాడ చాళుక్యులుగా పేరుపొందారు. వేములవాడను పూర్వం 'లేంబులవాడ' అనేవారు. పోదనపురం (బోధన్) పూర్వం అశ్మక రాజ్యానికి రాజధానిగా ఉండేది. ఈ రాజ్యాన్ని సపాదలక్ష దేశంగా పిలిచేవారు. సపాదలక్ష దేశం అంటే 1,25,000 బంగారు నాణేలు ఆదాయం వచ్చే భూమి అని అర్థం.
చాళుక్య రాజులు
వినయాదిత్య యుద్ధమల్లుడు
వినయాదిత్యుడు వేములవాడ చాళుక్య రాజ్య స్థాపకుడు. ఇతడు పోదనపురం(బోధన్)ను రాజధానిగా చేసుకుని పాలించాడు. రాష్ట్రకూట రాజ్యస్థాపకుడు దంతిదుర్గుడి సేనాపతిగా అనేక యుద్ధాల్లో పాల్గొని విజయాలు సాధించాడు. దానికి ప్రతిఫలంగా దంతిదుర్గుడు బోధన్ ప్రాంతాన్ని సామంత రాజ్యంగా ఇచ్చాడు.
బిరుదులు: విశ్వవిరాట్టకి, రామవిక్రమ, నృపాంకుష.
మొదటి అరికేసరి
మొదటి అరికేసరి కృష్ణా నదీతీరంలో ఉన్న ఏలేశ్వర క్షేత్రాన్ని దర్శించి, ఆ క్షేత్రంలో ఉన్న కాలాముఖ శైవాచార్యుడైన ముగ్ధ శివాచార్యుడికి బెల్మొగ గ్రామాన్ని విద్యాదానంగా ఇస్తూ, కొల్లిపర తామ్రశాసనాన్ని వేయించాడు. ఏలేశ్వరంలో వేదవిద్యను బోధించేవారు.
బిరుదులు: సమస్తలోకాశ్రయ, త్రిభువనమల్ల, రాజత్రినేత్ర, సాహసరామ.
మొదటి బద్దెగడు
బద్దెగడు 42 యుద్ధాలు చేసి 'సొలగదండడు' అనే బిరుదు పొందాడు. సొలగదండడు అంటే పరాజయాన్ని ఎరుగని వీరుడు అని అర్థం. ఇతడు వేములవాడలో బద్దెగేశ్వర దేవాలయాన్ని నిర్మించాడు.
రెండో అరికేసరి
రెండో అరికేసరి వేములవాడ చాళుక్యుల్లో గొప్పవాడు. ఇతడి సేనాపతి పెద్దన వేములవాడలో ఆదిత్యాలయాన్ని నిర్మించాడు. పెద్దన కోరికపై అరికేసరి ఆ దేవాలయం నిర్వహణకు 100 నివర్తనముల భూమిని దానంగా ఇచ్చి, వేములవాడ శిలాశాసనాన్ని వేయించాడు.
బిరుదులు: పాంబరాంకుష, అమ్మనగందవారణ, అరూఢసర్వజ్ఞ, ఉదాత్తనారాయణ, గుణనిధి, గుణార్ణవ, త్రిభువనమల్ల.
వాగరాజు
అరికేసరి కుమారుడు వాగరాజు. ఇతడు తన రాజధానిని బోధన్ నుంచి కరీంనగర్ పట్టణానికి సమీపంలో ఉన్న గంగాధర పట్టణానికి మార్చాడు.
మూడో అరికేసరి
మూడో అరికేసరి తన రాజధానిని గంగాధర నుంచి వేములవాడకు మార్చాడు. ఇతడు క్రీ.శ. 968లో రేపాక గ్రామంలో ఒక జినాలయాన్ని నిర్మించాడు. వేములవాడ చాళుక్యుల్లో మూడో అరికేసరి చివరి పాలకుడు. ఈ రాజ్యాన్ని కల్యాణి చాళుక్యులు ఆక్రమించారు.
సాంఘిక పరిస్థితులు
చాళుక్యుల కాలంలో వర్ణవ్యవస్థ స్థిర రూపాన్ని పొందడం వల్ల సంఘంలో కట్టుబాట్లు సడలలేదు. బ్రాహ్మణులు వేదాధ్యయనంతో పాటు రాజుల దగ్గర ముఖ్య ఉద్యోగాల్లో ఉండేవారు. క్షత్రియులు రాజధర్మాన్ని నిర్వహించేవారు. వైశ్యులు వర్తక వ్యాపారాలు చేసేవారు. వీరిని 'కోమట్లు' అంటారు. ప్రాచీన జైన ఆధ్యాత్మిక వీరుడైన గోమఠేశ్వరుడి పదం నుంచి కోమటి అనే పదం వచ్చినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. బోధన్ ఒకప్పుడు గోమఠేశ్వర ఆరాధనకు కేంద్రంగా ఉండేది. అక్కడి గోమఠేశ్వర విగ్రహం నమూనాగానే శ్రావణ బెళగోళలోని విగ్రహాన్ని చెక్కారని ఒక ఐతిహ్యం. వైశ్యులు (కోమట్లు) జైనాన్ని బాగా ఆదరించారు. శూద్రులు వ్యవసాయాది వృత్తులు చేసేవారు. విశ్వకర్మ కులస్థులకు శిల్పకారులుగా, రాజశాసనాలను చెక్కేవారిగా సమాజంలో విశేష గౌరవాదరణలు ఉండేవి. వీరు మొదట జైన మతస్థులు. వీరికి బాల్య వివాహాలు, అంజనం వేయించడం లాంటి మూఢ విశ్వాసాలుండేవి.
మతం
చాళుక్యుల కాలంలో జైన, వైదిక మతాలకు ఆదరణ లభించింది.
జైన మతం: అనేక మంది పాలకులు జైనమతాన్ని అనుసరించి, పలు జినాలయాలను, జైన బసదులను నిర్మించారు. జైనులు ఇతర మతాలవారిని తమవైపు ఆకర్షించడానికి వర్ణ వ్యవస్థను అంగీకరించారు. వర్ణభ్రష్టత లేకుండా జైనంలోకి వెళ్లిన వివిధ మతాలవారు తాము పూర్వం అనుసరించిన మతాచారాలనే పాటించేవారు. వీరి కాలంలో వేములవాడ గొప్ప జైనక్షేత్రంగా ఉండేది. ఈ మతాన్ని అనుసరించిన రాజులు, ఇతరులు జిన విగ్రహాలను కూష్మాండినీ దేవి విగ్రహాలను చెక్కించారు. జైన బసదులకు, మఠాలకు భూదానాలు చేశారు. రెండో అరికేసరి, మరికొంతమంది రాజులు శైవ మతాన్ని అనుసరించారు. వీరి కాలంలో వైష్ణవ పూజలు, శైవమత ఆరాధన ఉండేవి. శాసనశిలలపై వైదిక మత చిహ్నాలయిన శివలింగం, సూర్యచంద్రులు, వృషభం, డాలు, ఆవు, లేగదూడలను చెక్కారు.
విద్యా సారస్వతం
కన్నడం నాటి రాజభాషగా ఉండేది. వీరి కాలంలో శాసనాలు ఎక్కువగా కన్నడ భాషలోనే ఉండేవి. శివాలయాలకు అనుబంధంగా మఠాలుండేవి. మఠాలు, జైనబసదులు ఉన్నత విద్యాలయాలుగా పనిచేసేవి. వీటిలో వేద వేదాంగాలు, ఆగమాలు, శాస్త్రపురాణాలను బోధించడానికి విద్వాంసులుండేవారు. ఇక్కడ పనిచేసే అధ్యాపకుల జీవనోపాధికి నాటి రాజులు భూదానాలు చేశారు. శ్రీశైలానికి ఉత్తర ద్వారమైన ఏలేశ్వరంలో ఒక కాలాముఖ శైవ మఠం ఉన్నట్లు, అందులో సద్వోశివాచార్య, ముగ్ద శివాచార్యులనే గురు శిష్యులైన సన్యాసులన్నట్లు కొల్లిపర తామ్ర శాసనం ద్వారా తెలుస్తోంది. ఈ శాసనాన్ని మూడో అరికేసరి విద్యాదానంగా ఇచ్చినట్లు తెలుస్తోంది. జైన వాఙ్మయం సంస్కృతం తర్వాత కన్నడ భాషలో ఎక్కువగా లభించింది. వీరి కాలం కన్నడ భాషకు స్వర్ణయుగం లాంటిది.
పంపకవి
పంపకవి రెండో అరికేసరి ఆస్థాన కవి. ఇతడికి 'కవితా గుణార్ణవుడు' అనే బిరుదుండేది. అరికేసరికి దండనాయకుడుగా కూడా పనిచేశాడు. పంపకవి కన్నడ భాషలో ఆదికవి. ఇతడు మహాభారతాన్ని 'విక్రమార్జున విజయం' పేరుతో కన్నడ భాషలో రచించాడు. ఇది జైనమతపరంగా ఉంటుంది. అరికేసరికి అంకితమిచ్చాడు. ఈ గ్రంథంలో అరికేసరిని మహాభారతంలో అర్జునుడితో పోల్చాడు. రెండో అరికేసరి పంపకవికి ధర్మపురం (ధర్మపురి, కరీంనగర్ జిల్లా)ను అగ్రహారంగా ఇచ్చాడు. పంపకవి జైన మతాభిమాని. ఇతడు తాను రచించిన 'ఆదిపురాణం'లో జైన తీర్థంకరుల చరిత్రలను వర్ణించాడు.
సోమదేవ సూరి
ఈ జైనకవి క్రీ.శ. 950 ప్రారంభంలో గంగాధర పట్టణంలో నివసించేవాడు. వాగరాజు ఆస్థాన కవి. 'యశస్తిలక' అనే చంపువును రచించాడు. ఈ గ్రంథంలో దక్షిణాపథంలోని ప్రజల సంస్కృతి, ఆచార వ్యవహారాలు తెలిపాడు. ఇతడు 'నీతి వాక్యామృత' అనే రాజనీతి గ్రంథాన్ని రచించాడు. 'యుక్తి చింతామణీసూత్ర' గ్రంథం కూడా సోమదేవసూరిదే. ఇతడి బిరుదులు - శ్యాద్వాదచలసింహ, తార్కిక చక్రవర్తి, కవిరాజు.
కన్నడ రత్నత్రయం (కవి త్రయం)
పొన్నకవి (శాంతిపురాణం, భువనైక రామాభ్యుదయం), రన్నకవి (గదాయుద్ధం, అజిత పురాణం), పంపమహాకవిని కన్నడ రత్నత్రయం అనేవారు.
జిన వల్లభుడు: పంప మహాకవి సోదరుడు. జిన భవనాలను నిర్మించడంలో నేర్పరి. జిన వల్లభుడు కురిక్క్యాల శాసనాన్ని సంస్కృతం, తెలుగు, కన్నడ భాషల్లో వేయించాడు. తెలుగు భాషలోని మొదటి మూడు కంద పద్యాలు జిన వల్లభుడి కురిక్క్యాల శాసనంలో ఉన్నాయి. ఇతడి మిత్రుడు మల్లియరేచన 'కవిజనాశ్రయం' అనే గ్రంథాన్ని రచించాడు. ఇతడు గంగాధర గ్రామంలో జైన తీర్థంకరుల విగ్రహాలను పెట్టించాడు.
నిర్మాణాలు
వేములవాడ చాళుక్యులు పోదన(బోధన్) నగరంలో జైన తీర్థంకరుల విగ్రహాలను చెక్కించారు. ఇందులోని ఒక విగ్రహం ఎత్తు 56 అడుగులు. ఇది విరిగిపోయి శిరస్సు మాత్రమే ఉంది. ఈ విగ్రహాన్ని ఆదర్శంగా తీసుకుని కర్ణాటకలోని శ్రావణ బెళగోళలోని విగ్రహాన్ని చాముండరాయ రూపొందించాడు. వీరు వేములవాడ, బోధన్, చెన్నూరు, కాళేశ్వరం, కురిక్క్యాల, గంగాధరలలో జైనాలయాలను నిర్మించారు.
వేములవాడలోని శివాలయాలు
1) రాజరాజేశ్వరాలయం
2) బద్దెగేశ్వరాలయం
3) భీమేశ్వరాలయం
4) నగరేశ్వరాలయం
* వేములవాడలో నిర్మించిన జైనాలయాలను జైనమతం క్షీణించిన తర్వాత శైవాలయాలుగా మార్చారు.
No comments:
Post a Comment